Crackers Factory Fire Accident : మధ్యప్రదేశ్లో ఘోరం.. పటాకుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి..
X
మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఓ పటాకుల ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. హర్దాలోని పటాకుల కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. పటాకుల తయారీకి ఉపయోగించే ముడిసరుకుకు మంటలు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. భారీ శబ్దంతో పటాకులు పేలడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.
మంటల్లో చిక్కుకున్న వారిని స్థానికులు రక్షించి దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమీపంలోని సియోనీ మాల్వా ప్రాంతంలో భూమి కంపించిందంటే పటాకులు పేలిన శబ్ద తీవ్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 150 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.
పేలుడు గురించి సమాచారం అందుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పటాకుల ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటం, దట్టమైన పొగ కమ్ముకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.