Sachin Tendulkar:సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు MLA నిరసన
X
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ఓ ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు ప్రచారకర్తగా సచిన్ వ్యవహరించడంపై.. మహారాష్ట్రలోని స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు(బచ్చు కడు) తన అనుచరులతో కలపి నిరసన తెలిపారు. యాడ్ ప్రమోషన్ నుంచి సచిన్ తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసనలకు దిగిన ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిజానికి సచిన్ ప్రమోషన్స్ చేస్తున్న ఆ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ను కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో గేమ్స్ ఆడడమే కాకుండా డబ్బులు కూడా పెట్టొచ్చు. తద్వారా డబ్బులు సంపాదించడమే కాకుండా పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వీటిని ఫాంటసీ గేమ్స్ అని పిలుస్తున్నప్పటికీ.. ఒక రకంగా ఇది కూడా జూదమే అని అంటున్నారు. సచిన్ వంటి ప్లేయర్ ఇలాంటి యాడ్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని బాంద్రాలో సచిన్ ఇంటి ముందు కొందరు గొడవ చేశారు. ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు ఈ గొడవను ముందుండి నడిపించినట్లు తెలుస్తోంది.
భారతరత్న అయిన సచిన్ ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రోత్సహించడం మానేయాలని సదరు ఎమ్మెల్యే అన్నారు. లేదంటే తన భారతరత్నను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ యాడ్‌లో నటించడంపై సచిన్‌కు తాము ఇప్పటికే నోటీసులు కూడా పంపిచినట్లు ఆందోళనకారులు తెలిపారు. ఆగష్టు 30 వరకు సమయం ఇచ్చినా సచిన్ స్పందించలేదన్నారు. దీంతో మరోసారి నోటీసులు పంపించనున్నట్లు చెప్పారు. ఒక వేళ సచిన్ భారతరత్న గ్రహీత కాకపోయి ఉంటే తాము ఆందోళన చేసే వాళ్లం కాదని నిరసనకారులు తెలిపారు. రసన తెలిపిన ప్రహార్ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బచ్చూ కాడూతోపాటు మరో 22 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర పోలీసు చట్టంలోని సెక్షన్ 37 (నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన), సెక్షన్ 135 (చట్టాన్ని ఉల్లంఘించడం) కింద అభియోగాలు మోపినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రహార్ జనశక్తి పార్టీ సపోర్ట్‌గా ఉంది.