Mayawati: ఇండియా కూటమికి షాక్.. BSP చీఫ్ మాయవతి సంచలన ప్రకటన
X
లోక్ సభ ఎన్నికల వేళ బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి(Mayawati) పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్పీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని అన్నారు. అయితే ఎన్నికలయ్యాక పొత్తుకు అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోరాడినప్పుడల్లా లాభం కంటే నష్టపోయిందే ఎక్కువని, తమ పార్టీ ఓట్లు ఇతరులకు బదిలీ అవుతున్నాయని అన్నారు. దీంతో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గద్దె దించేందుకు దేశంలోని ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా కూటమితో కలిసే ప్రసక్తే లేదని మాయవతి ప్రకటించారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, జనతా దళ్, ఆప్, ఎస్పీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు మోడీ సర్కార్‌ను ఓడించేందుకు పావులు కదుపుతున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలను కలుపుకోవాలని వ్యుహాలు రచిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాగా.. యూపీలో మరో ప్రధాన పార్టీ అయిన బీఎస్పీని సైతం ఇండియా కూటమిలో కలుస్తోందని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పొత్తులపై మాయవతి తమ వైఖరిని స్పష్టం చేశారు.
జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం వలన ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్రంలో భారీగా దళిత ఓటు బ్యాంక్ కలిగిన బీఎస్పీ తాజా నిర్ణయంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఎన్డీఏ కూటమికి కలిసి వస్తుందని పేర్కొంటున్నారు