Rahul Bhatia : రాహుల్ భాటియా.. ఒక్క రోజు సంపాదన రూ.143 కోట్లు
X
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎండీ, కో-ఫౌండర్ రాహుల్ భాటియా సంపాదన గురించి మీకు తెలుసా. ఇంజనీరింగ్ చదివి.. తన తెలివితేటలతో వ్యాపారం మొదలు పెట్టి.. భారీ లాభాలు గడిస్తూ.. భారతదేశంలోనే 22వ ధనవంతుడిగా నిలిచారు. రోజుకి వంద కోట్లకు పైగా సంపాదనతో.. రెండు నెలల్లో వేల కోట్లుకు అధిపతి అయ్యాడు.
భారత్‌లో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిలిపివేశాక, ఇతర విమానయాన సంస్థలకు ప్రయాణికుల తాకిడి ఎక్కువైంది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ బాగా లాభపడింది. విమాన టిక్కెట్లకు అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో.. జనాలు ఇండిగో వైపు మొగ్గు చూపారు. ఫలితంగా 2 నెలల కాలంలో షేర్ మార్కెట్లలో (ఇండిగో) కంపెనీ స్టాక్ కూడా పెరిగింది. ఆ రెండు నెలల్లోనే కంపెనీ నికర విలువ 1 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఒక్కో రోజుకు రూ.143 కోట్ల చొప్పున.. కేవలం అరవై రోజుల్లోనే కంపెనీ ప్రమోటర్ రాహుల్ భాటియా సంపాదన రూ.8583 కోట్లకు పెరిగింది.
రాహుల్ భాటియా నికర విలువ 4.28 బిలియన్ డాలర్లు. జూన్ లో ఆ విలువ 5.32 బిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 43000 కోట్లకు పైనే. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. భాటియా సంస్థ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, షేరు ధర 32 శాతం పెరిగి.. అతడిని దేశంలో 22 వ ధనవంతుడిగా మార్చింది. మార్చిలో రూ.1912 ఉన్న షేరు ధర జూన్ నాటికి రూ.2418.50కి పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.93,263.84 కోట్లు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్థిరంగా ఉండడం కూడా భాటియా కంపెనీకి అనుకూలమైన ఆర్థిక ఫలితాలు రావడానికి మరో కారణం.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో రాహుల్ భాటియా, అతని కుటుంబానికి 38 శాతం వాటా ఉంది. అతనికున్న ఆస్తి(సంపద)లో ఎక్కువ భాగం ఇదే. దేశీయ మార్కెట్‌లో భాటియా కంపెనీ.. ఇండిగో 55 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాదు.. భారతదేశంలో 19 హోటళ్లు, విదేశాలలో 14 హోటళ్లను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ హోటల్స్ కూడా ఈ గ్రూప్‌కు స్వంతం. ఈ హాటల్స్ అన్నింటికి మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీ ప్రమోటర్ రాహుల్ భాటియానే.
రాహుల్ భాటియా.. 2006లో రాకేష్ గంగ్వాల్‌తో కలసి స్థాపించిన ఇండిగో కంపెనీకి.. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, 300 విమానాలు మరియు 101 గమ్యస్థానాలు ఉన్నాయి. కెనడాలోని అంటారియోలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్‌లూ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు భాటియా. 1989లో ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు. మెయిన్ బిజినెస్ మాత్రం ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్. కంపెనీ ఆ తరువాత.. సివిల్ ఏవియేషన్ (ఇండిగో), హాస్పిటాలిటీ, ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్, ట్రావెల్ కామర్స్, అడ్వాన్స్‌డ్ పైలట్ ట్రైనింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ మరియు లాజిస్టిక్స్‌కూ విస్తరించింది.