కౌగిలించుకోవడం నేరం కాదు.. కోర్టులో బ్రిజ్ భూషణ్
X
మహిళా రెజ్లర్ల కౌగిలించుకోవడంపై బ్రిజ్ భూషణ్ సింగ్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అవుట్‌గోయింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కోర్టు ముందు లైంగిక వేధింపుల ఆరోపణలపై తనను తాను సమర్థించుకున్నారు. ‘‘హగ్గింగ్… నేరపూరిత శక్తి లేదా లైంగిక ఉద్ధేశం లేకుండా స్త్రీని తాకడం నేరం కాదు’’ అని బ్రిజ్ భూషణ్ కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ సింగ్ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్రిజ్ భూషణ్, సహ నిందితుడు, సస్పెండైన డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌పై అభియోగాలు మోపాలా వద్దా అన్న దానిపై ఢిల్లీ కోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా న్యాయవాది రాజీవ్ మోహన్ ఆయన తరుఫున వాదనలు వినిపించారు. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లు భయం వల్ల ఐదేళ్లుగా నోరువిప్పలేదనడం సరైన కారణం కాదని న్యాయవాది తెలిపారు. అన్ని రోజులు స్వేచ్ఛగా తిరిగి, ఐదేళ్లలో ముందుకు రాకుండా.. ఇప్పుడు ముప్పు ఉందని చెప్పడం సరైన వివరణ కాదని వాదించారు. అలాగే దేశం బయట కొన్ని నేరాలు జరిగాయన్న ఆరోపణలపై దేశంలో విచారణ జరిపే అధికార పరిధి కోర్టుకు లేదన్నారు.
‘ఆరోపణల విషయానికొస్తే.. ఇందులో కొన్ని భారత్ వెలుపల జరిగాయి. మూడు కేసులు మాత్రమే భారత్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. అందులో రెండు అశోకా రోడ్, మరొకటి సిరి ఫోర్ట్‌కు సంబంధించినవి. సిరి ఫోర్ట్ కేసు కేవలం కౌగిలింతకు సంబంధించింది. లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం, ముట్టుకోవడం నేరం కాదు’ అని బ్రిజ్ భూషణ్ తరఫు లాయర్ మోహన్ కోర్టులో వాదించారు. ‘రెజ్లింగ్‌లో కోచ్‌లు ఎక్కువగా పురుషులే ఉంటారు. మహిళా కోచ్‌లు అరుదు. ఏదైనా విజయం సాధించిన సందర్భంలో ఆటగాళ్లను కౌగిలించుకుంటే.. అది నేరం కిందకు రాదు. ఉత్సాహంతో ఆలింగనం చేసుకోవడం నేరం కాదు’ అని వివరణ ఇచ్చారు. ఈ కేసుపై గురువారం కూడా వాదనలు జరగనున్నాయి.