బ్రిజ్ భూషణ్ కేసులో ట్విస్ట్.. ఆమె మైనర్ కాదంటున్న పోలీసులు
X
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. రెజ్లర్ల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెల్లడించారు. మైనర్ రెజ్లర్ ను వేధించాడంటూ నమోదైన కేసులో సదరు యువతి మైనర్ కాదని తేలినట్లు చెప్పారు.
బాధితురాలు మైనర్ కాదు
వేధింపులకు గురైనట్లు చెప్తోన్న సమయంలో సదరు యువతి.. మైనర్ కాదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆమెను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి మరోసారి వాంగ్మూలం తీసుకొన్నట్లు తెలుస్తోంది. వేధింపుల కేసు కొనసాగుతుందని, ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన వయసుకు సంబంధించిన అంశంలో పోలీసులు మార్పు చేశారని సదరు యువతి తండ్రి జాతీయ మీడియాకు చెప్పాడు. అయితే ఈ మార్పుతో బ్రిజ్‌భూషణ్‌పై నమోదుచేసిన పోక్సో కేసును న్యాయస్థానం తొలగించే అవకాశముంది.
రెండు ఎఫ్ఐఆర్లు
బ్రిజ్ భూషణ్ వేధిస్తున్నాడంటూ ఆరుగురు రెజ్లర్లతో పాటు ఓ మైనర్ తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఏప్రిల్ 28న రెండు ఎఫ్ఐఆర్ లు నమోదుచేశారు. మైనర్ తండ్రి కేసు వాపసు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా వాటిని ఆయన తోసిపుచ్చారు. తాజాగా బాధిత రెజ్లర్ వయసు విషయంలో జరిగిన మార్పుతో పోక్సో కేసు నుంచి బ్రిజ్ భూషణ్ కు విముక్తి లభించే అవకాశముంది.
నిరసన వాయిదా
ఇదిలా ఉంటే బుధవారం కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు భేటీ అయ్యారు. దాదాపు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశం అనంతరం మల్లయోధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై ఈ నెల 15లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని, జూన్ 30లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేయడంతో తాము చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.