Mizoram Assembly Election Results : మరికాసేపట్లో తేలనున్న మిజోరం భవితవ్యం
X
నేడు మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 40 నియోజక వర్గాలున్న ఈ రాష్ట్రంలో అధికార ఎంఎన్‌ఎఫ్(మిజో నేషనల్ ఫ్రంట్), జడ్‌పీఎం (జొరం పీపుల్స్ మూవ్‌మెంట్), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు మిజోరంలోనూ ఆదివారమే ఓట్ల లెక్కింపు నిర్వహించేలా ఎన్నికల సంఘం తొలుత నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, క్రైస్తవులు అధికంగా ఉన్న మిజోరంలో ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు, చర్చి కమిటీలు, విద్యార్థి సంఘాలు చేసిన అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపును ఈసీ సోమవారానికి వాయిదా వేసింది.
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 13 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని మిజోరం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్.లియాంజెలా తెలిపారు. ముందుగా ఉదయం 8.30 గంటల వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, ఆపై ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నట్లు తెలిపారు. ఇందులో మొత్తం నాలుగు వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. నవంబరు 7న మిజోరం అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ 26, జడ్‌పీఎం 8, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక స్థానం గెలుపొందాయి.