Mizoram Election Results 2023 : అధికార పార్టీకి ఎదురుదెబ్బ.. లీడింగ్‌లో విపక్షం
X
మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) పార్టీ 26 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక జోరంతంగా(Cm Zoramthanga) నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) 10 స్థానాల్లో, BJP 3, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్ లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 8.57 లక్షల మంది ఓటర్లలో 80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 40 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో 18 మంది మహిళలు సహా మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మిజోరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీ 21 సీట్లను దాటాలి. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), కాంగ్రెస్ 40 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ 13 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మిజోరంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 4 స్థానాల్లో పోటీ చేసింది. 17 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2018లో ఎంఎన్‌ఎఫ్ 26 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది. అయితే ఈసారి ZPM ఆ నంబర్ ని కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ZPM అభ్యర్థి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ని 900 ఓట్లతో ఓడించినట్లు పక్కా సమాచారం . కాగా గత ఎన్నికల్లో ZPM 8 స్థానాల్లోనే విజయం సాధించగా, కాంగ్రెస్ 2013లో గెలిచిన 34 స్థానాలతో పోలిస్తే కేవలం ఐదు సీట్లతో సరిపెట్టుకుంది.