Home > జాతీయం > కేజ్రీవాల్ పోరాటానికి మద్దతు ప్రకటించిన స్టాలిన్

కేజ్రీవాల్ పోరాటానికి మద్దతు ప్రకటించిన స్టాలిన్

కేజ్రీవాల్ పోరాటానికి మద్దతు ప్రకటించిన స్టాలిన్
X

ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరాటం ఉద్ధృతం చేశారు. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలసి చెన్నై వెళ్లిన ఆయన.. తన పోరాటానికి మద్దతివ్వాలని స్టాలిన్ను కోరారు.

స్టాలిన్తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్‌ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై చర్చించినట్లు చెప్పారు. కేంద్ర నిర్ణయం అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అన్నారు. సీఎం స్టాలిన్ ఢిల్లీ ప్రజలకు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. అనంతరం మాట్లాడిన స్టాలిన్ మోడీ ప్రభుత్వం.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని ఢిల్లీ, కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీల నాయకులకు స్టాలిన్ పిలుపునిచ్చారు.

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో కేజ్రీవాల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు. శుక్రవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. విపక్షాలన్నీ ఏకమైతే కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రాజ్యసభలో సునాయాసంగా ఓడించవచ్చని కేజ్రీవాల్ అంటున్నారు.

Updated : 1 Jun 2023 3:58 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top