అందుకే గోషామహల్ అభ్యర్థిని ప్రకటించలేదు : రాజాసింగ్
X
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించారు. మొదటి విడతలో మొత్తం 115 మంది పేర్లను వెల్లడించారు. ఇంకా నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్ మొదటి జాబితాపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. గోషామహల్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
గోషామహల్‌లో అభ్యర్థిని ప్రకటించకపోవడానికి వేరే కారణాలున్నాయని చెప్పారు. అక్కడ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ ప్రకటించలేదని విమర్శించారు. 2018లోను మజ్లిస్ పార్టీయే అభ్యర్థిని నిర్ణయించిందన్నారు. తనను ఓడించేందుకు భారీగా డబ్బులు కూడా ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ సారి కూడా తానే బీజేపీ తరఫున బరిలోకి దగి విజయం సాధిస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. . బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి పెద్దల ఆశీర్వాదం తనకు ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు గోషామహల్ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేయించిన సర్వేల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తేలిందన్నారు. అందుకే కేసీఆర్కు భయం పట్టుకుందని రాజాసింగ్ తెలిపారు.