మణిపూర్లో ఆగని హింస.. భద్రతాదళాలపై నిరసనకారుల కాల్పులు..
X
మణిపూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిరసనకారుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి కొందరు ఆందోళనకారులు క్వాక్తా, కంగ్వాయ్ ప్రాంతాల్లో ఆటోమేటిక్ ఆయుధాలతో భద్రతాబలగాలపై కాల్పులకు తెగబడ్డారు. తెల్లవారుజాము వరకు ఆ ప్రాంతాల్లో కాల్పుల మోత వినిపిస్తూనే ఉంది. ఆందోళనకారులు గుంపులుగా ఏర్పడి పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆర్మీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తక్షణమే స్పందించడంతో నిరసనకారులు వెనుదిరిగారు.
విధ్వంసానికి కుట్ర
హింసాత్మక ఘటనల నేపథ్యంలో అర్థరాత్రి వరకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు ఇంఫాల్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దాదాపు వెయ్యి మంది ఆందోళనకారులు ప్యాలెస్ కాంపౌండ్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేయడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.
చెదరగొట్టిన ఆర్పీఎఫ్
మణిపూర్ యూనివర్సిటీతో పాటు స్థానిక ఎమ్మెల్యే నివాసం వద్ద రాత్రి దాదాపు 300 మంది గుమికూడినట్లు సమాచారం అందడంతో ఆర్బీఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. మరోవైపు శుక్రవారం అర్థరాత్రి ఇంఫాల్ వెస్ట్ డిస్ట్రిక్ట్ లోని ఇరింగ్బామ్ పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డ 400 మంది నిరసనకారులు ఆయుధాలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నివాసంపైనా దాడిచేయగా సైన్యం వారిని చెదరగొట్టింది.