Home > జాతీయం > పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు...! మోదీ స్కెచ్ ఇదేనా..?

పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు...! మోదీ స్కెచ్ ఇదేనా..?

పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు...! మోదీ స్కెచ్ ఇదేనా..?
X

ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరగాలని నిబంధనలు చెబుతుంటాయి. అయితే మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కావడంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తమకు తోచినప్పుడు ఈవీఎంలను బీప్ బీప్ అని అరిపిస్తుంటాయి. సంక్షోభాల నుంచి గట్టెక్కడం, బలప్రదర్శన వంటి అనేకానేక కారణాలతో ముందస్తు ఎన్నికలు మన దేశంలో చాలా మామూలే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ముందస్తు పోరుకు కత్తుల నూరుతోంది. మోదీ హవాకు వచ్చే ఎన్నికల్లోనూ తిరుగు ఉందని, ఈసారి ఏకంగా 350 సీట్లు తెచ్చుకుంటామని కమలనాథులు చెబుతున్నారు. కొన్ని సర్వేలు కూడా కాషాయ గాలే వీస్తుందని చెప్పుడంతో పైకి ధీమాగా ఉన్నా లోలోపల మాత్రం బితుకుబితుకుమంటున్నారు.

ఇప్పటికప్పుడు జరిగితే

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల అంశాన్ని ప్ర్రస్తావించారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అని ఆయన నేతలను ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి వ్యూహాలు రచించాలని కోరారు. పార్టీ కీలక సమావేశంలో నడ్డా ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం సహజంగానే కనిపించినా పార్టీ నాడి ఎలా ఉందో అంచనా వేయడానికి ఆయన ఇలాంటి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తారని సంకేతాలు వస్తున్నాయి.

ఎందుకు..?

పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు జరగొచ్చని ఆరు నెలలుగా ప్రచారంలో ఉన్నా బీజేపీ స్పష్టమైన సంకేతాలైతే ఇవ్వలేదు. ప్రభుత్వ పనితీరు నానాటికీ తీసికట్టుగా ఉందని, 2024 మే వరకు గ్రాఫ్ ఇలాగే పడిపోతే గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని నేతల అంచనా. అందుకే ప్రజల్లో సానుకూలత కోసం మోదీ కొత్తకొత్త ప్రాజెక్టులకు శ్రీకారాలు, వందేభారత్ వంటి ప్రాజెక్టుల జోరు పెంచినట్లు కనిపిస్తోంది. మరోపక్క విపక్షాలు మెల్లమెల్లగా ఏకతాటిపైకి వస్తుండడంతో కాషాయ దళం అప్రమత్తమైంది. కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు పలు ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు వెళ్తే ప్రజా వ్యతిరేకతను కొంత అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మోదీ పాతబడిన ‘ఉమ్మడి పౌరస్మృతి’ని కెలికినట్లు భావిస్తున్నారు.

ఇలాంటి మరికొన్ని సున్నితమైన అంశాలతో నిప్పు రాజేసి ఎన్నికలకు వెళ్తే గెలుపు సులువవుతుందని బీజేపీ ఆలోచిస్తోంది. శ్రేణుల సన్నద్ధత, ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి వంటివాటిని అంచనా వేయడం, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో మార్పుచేర్పులు చేయడం వంటివన్నీ ‘ముందస్తు’ లో భాగమమని విశ్లేషకులు అంచనా. ఎన్నికలకు సమాయత్తం కావడానికే ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం చేసినట్లు తెలుస్తోంది. కూటమిని విదిలిపెట్టిపోయిన చంద్రబాబు వంటి పాతమిత్రులతోపాటు కొత్త పార్టీలను కూడా చేర్చుకోవడానికి కసరత్తు సాగుతోంది. అన్నీ అనుకున్నట్టు సాగితే, ఆపై ఈసీ దయ ఉంటే లోక్ సభ ఎన్నికలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు జరిగే అవకాశం లేకపోలేదు.

Updated : 9 July 2023 4:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top