IndependenceDay: విశ్వకర్మలకు బీసీలకు గుడ్ న్యూస్.. త్వరలో..
X
సంప్రదాయ వృత్తులు చేసే ఓబీసీలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ తెలిపారు. ఎర్రకోట వద్ద జెండా ఆవిష్కరించిన తర్వాత ప్రసంగించిన మోదీ.. చేతువృత్తులవారికి కొత్త పథకం ప్రకటించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి విశ్వకర్మ యోజనా పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఆర్థిక బలోపేతంతోపాటు వారికి మెరుగైన జీవితం కల్పించడానికే ఈ పథకం తీసుకొస్తున్నట్లు చెప్పారు. 13 - 15వేల కోట్ల రూపాయలతో వచ్చే నెలలో ఈ పథకానికి శ్రీకారం చుడతామన్నారు.
సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. స్వర్ణకారులు, కమ్మరులు, రజకలు, క్షురకులు, తాపీమేస్త్రీల కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో పేదరికాన్ని నిర్మూలించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని అగ్రగామిగా నిలబెడతామని చెప్పారు. సస
సొంతింటి కల సాకారమే..
మరో నూతన పథకానికి మోదీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా కొత్త పథకం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ స్కీమ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తక్కువ ధరకు లభించే జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉండేలా జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10వేల నుంచి 25వేలకు పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. మార్కెట్‌లో రూ.100కు దొరికే మందులు.. జన ఔషధి కేంద్రాల్లో రూ.10-15కే లభిస్తున్నట్లు స్పష్టం చేశారు.