ఉమ్మడి పౌరస్మృతి కావాలి, ముస్లిం మహిళకు న్యాయం జరగాలి.. మోదీ
X
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ మతం అజెండాతో ముందుకు వెళ్లనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల్లో బజరంగ్ దళ్‌పై కాంగ్రెస్ ప్రతిపాదిత నిషేధాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన మంగళవారం భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పలు సున్నితమైన అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు మహిళలకు న్యాయం జరగాలంటే ట్రిపుల్ తలాఖ్ లాంటివి ఉండకూడదని స్పష్టం చేశారు. ‘‘ట్రిపుల్ తలాఖ్ నిజంగానే ఇస్లాంలో భాగమైతే పాకిస్తాన్, ఇండోనేసియా, బంగ్లాదేశ్ లలో ఎదుకు లేదు. దేశమంతా ఒక కుటుంబం అని చెబుతున్నాం. మరి ఒక కుటుంబంలోని అందరికీ ఒకే నియమాలు కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎందుకుండాలి? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రిపుల్ తలాఖ్ వంటి అన్యాయ పద్ధతులకు మద్దతు పలుకుతున్నారు. ట్రిపుల్ తలాఖ్ కేవలం ముస్లింల అమ్మాయిల సమస్యే కాదు. పెళ్లయి పదేళ్లయ్యాక భర్త విడాకులు ఇచ్చాక ఆమె పుట్టింటికి వస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉమ్మడి పౌరస్మృతే. దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. 90 శాతం సున్నం ముస్లింలు ఉన్న ఈజిప్టు కూడా 90 ఏళ్ల కిందటే ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేసిందని మోదీ చెప్పారు.
ఒక దేశంలో రెండు చట్టాలు కుదరవు
భారత రాజ్యంగం పౌరలందరీకీ సమాన హక్కులు ప్రసాదిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా దేశంలో రెండు చట్టాలు కుదరవని స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి కావాలని సుప్రీం కోర్టు కూడా కోరుతోందన్నారు. దేశంలోని విపక్షాలు ప్రజలను అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘మీరు ఇటీవల ఓ గ్రూప్ ఫోటో చూసి వుంటారు. వాళ్లందరూ కలిస్తే అవినీతి 20 లక్షల కోట్లు దాటుతుంది,’’ అని మండిపడ్డారు.
ఏమిటీ ఉమ్మడి పౌరస్మతి?
భిన్నమతాలకు నిలయమైన దేశంలో కొన్ని మతాలకు చారిత్రక, సాంస్కృతి, మైనారిటీపరమైన కారణాల వల్ల ప్రత్యేక చట్టాలు అమలుచేసుకునే వీలు ఉంది. పెళ్లిళ్లు, విడాకులు, భరణం, ఆస్తుల పంపకం, పిల్లల దత్తత వంటి అంశాల్లో ఆయా మతాల నిబంధనలు పాటించుకోవచ్చు. ముఖ్యంగా మైనారిటీలకు ‘ముస్లిం పర్సనల్ లా’ వర్తింపజేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రత్యేక చట్టాలు సమాన హక్కులకు భంగం కలిగిస్తున్నాయనే ఆందోళన ఉంది. ట్రిపుల్ తలాఖ్ ద్వారా భార్యలకు కారణం లేకుండా విడాకులు పెద్ద సమస్యగా ఉండేది. 2019లో కేంద్రం దీన్ని రద్దు చేసింది. అయితే అది తమ మతహక్కు అని ముస్లింలు వాదిస్తున్నారు. ఇది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ ఉమ్మడి పౌరస్మృతే పరిష్కారమని మోదీ ప్రభుత్వం చెబుతోంది. దేశంలోని ప్రజలందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడం దీని భావన. రాజ్యాంగంలోని ఆర్టికల్- 44 కూడా దీని ప్రాధాన్యాన్ని చెబుతోంది. అయితే రాజకీయ కారణాలతో ఇది కేవలం డిమాండుగానే మిగిలిపోయింది.