పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
అప్పటివరకు ఎలాంటి చర్యలొద్దు.. హైకోర్టు
X
ప్రధాని ఇంటి పేరు(Modi Surname )పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి కాస్త ఊరట లభించినట్లయింది. ఆ కేసులో దాఖలైన పిటిషన్ పై జార్ఖండ్ హైకోర్టు విచారణ జరిపి, రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 16న తదుపరి విచారణ చేపట్టనున్నది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో ‘మోడీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, రాహుల్ కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో పరువు నష్టం(Defamation Case) కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జార్ఖండ్‌లో నమోదైన కేసు విచారణ సందర్భంగా రాహుల్‌కు హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.
ప్రదీప్ మోడీ(Pradeep Modi ) అనే వ్యక్తి... హైకోర్టులో వేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కుమార్ ద్వివేది(Justice SK Dwivedi) బెంచ్ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు, సమాధానం ఇవ్వాలని పిటిషనర్‌ని ఆదేశించింది. అదే సమయంలో రాహుల్ గాంధీకి ఊరటనిస్తూ తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. రాంచీలో రాహుల్ గాంధీపై బిజెపి నేత ప్రదీప్ మోడీ పరువునష్టం కేసు వేశారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. పాట్నాలో కూడా రాహుల్ పై ఇదే కేసు కొనసాగుతోంది.