MODI : ఒత్తిడిని అధిగమించడానికి విద్యార్థులకు మోదీ టిప్స్
X
విద్యార్థులను ఇతర పిల్లలతో పోల్చకూడదన్నారు ప్రధాని మోదీ. అలా పోల్చి చూడడం వల్ల వారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ భారత మండలంలో ఏర్పాటు చేసిన ‘పరీక్షా పే చర్చ’ ఏడో ఎడిషన్‌లో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రధాని పలు సలహాలు, సూచనలు అందించారు. పరీక్షల సమయంలో పేరెంట్స్, టీచర్లు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదని చెప్పారు.
పిల్లలను మరొకరితో పోల్చకూడదని..అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుందని సూచించారు. అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు. కొంతమంది తల్లిదండ్రులైతే వారి పిల్లల ప్రోగ్రెస్ కార్డును తమ విజిటింగ్ కార్డ్‌గా భావిస్తారని తెలిపారు. ఎవరినైనా కలిసినప్పుడు గానీ, ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారి పిల్లల గురించి గొప్పగా చెప్పడం కరెక్ట్ కాదని తెలిపారు. టీచర్లు తమ పనిని జీతం కోసం చేసే ఉద్యోగంలా కాకుండా...విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలని సూచించారు. పోటీ, సవాళ్లు మన జీవితంలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి కానీ..అవి ఆరోగ్యకరంగా ఉండాలన్నారు.
ఏ విషయంలోనూ పక్క వాళ్లతో పోటీ పడొద్దనీ మీతో మీరే పోటీపడండని విద్యార్థులకు టిప్స్ అందించారు. విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్మిస్తారని తెలిపారు. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉందని..అందువల్ల ఈ ప్రోగ్రామ్ తనకి కూడా పరీక్ష లాంటిదే అని మోదీ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ప్రధాని మోదీ ఈ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏటా ఈ ప్రోగ్రామ్‌కు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాది 2.26 కోట్ల మంది పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్‌తో పాటు కళా ఉత్సవ్ విజేతలు పాల్గొన్నారు.