Ayodhya Ram Mandir : రామమందిరంలోకి ఊహించని అతిధి.. ఆయనే స్వయంగా వచ్చారంటున్న భక్తులు..
X
అయోధ్య రామమందిరంలో అనూహ్య ఘటన జరిగింది. రామయ్య దర్శనానికి ఊహించని అతిధి వచ్చారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు వచ్చిన ఆ అతిధిని చూసినవారంతా రాముని పరమభక్తుడే దర్శనానికి వచ్చాడని అంటున్నారు.
అయోధ్యలో కొలువుదీరిన రామ్లల్లాను దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రం ఓ వానరం వచ్చింది. సాయంత్రం 5.50 గంటల సమయంలో రామ మందిర ఆవరణలోకి వచ్చిన కోతి.. ఆలయమంతా కలియదిరిగింది. దక్షిణం వైపు గేటు నుంచి రామయ్య ఉత్సవమూర్తి వద్దకు వెళ్లింది. ఊహించని అతిధిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఆ వానరం ఉత్తరాన ఉన్న గేటు వైపు పరిగెత్తింది. అయితే అది మూసి ఉండటంతో తూర్పువైపు గేటు నుంచి బయటకు వెళ్లిపోయిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
రాముడి ఉత్సవమూర్తి వద్దకు వచ్చిన వానరాన్ని చూసిన భక్తులంతా పులకించిపోయారు. రామమందిరంలో కొలువుదీరిన బాల రాముడి దర్శనానికి స్వయంగా హనుమంతుడే వచ్చాడని అంటున్నారు. ఇదిలా ఉంటే సోమవారం అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగగా.. ఆయన దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.