బిపోర్జాయ్ ఎఫెక్ట్.. రుతుపవనాలు మరింత ఆలస్యం..
X
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్’ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. సైక్లోన్ ప్రభావం కాస్తా నైరుతి రుతుపవనాలపై పడింది. తుఫాను కారణంగా రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మరో మూడు రోజులు
వాస్తవానికి మే 31న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాయని ఐఎండీ ప్రకటించింది. అయితే ఆ గడువు దాటినా రుతుపవనాలు మాత్రం ఇంకా కేరళ తీరానికి చేరలేదు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుఫాను కారణంగా రుతుపవనాలు ముందుకు కదలలేకపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఫలితంగా అవి కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2 నుంచి 3 రోజులు సమయం పట్టే అవకాశముందని స్కైమెట్ అంచనా వేస్తోంది.
తుఫానుతో మరింత ఆలస్యం
గతేడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకాయి. అయితే ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా చేరలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందంటున్న వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం తుఫాను కారణంగా రుతుపవనాలు అరేబియా సముద్రంలో ముందుకు కదలలేకపోతున్నాయని చెబుతున్నారు. రుతుపవనాలు ఆలస్యం కావడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈసారి వర్షపాతం ఐదు శాతం వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.
తీరప్రాంతాల్లో అప్రమత్తం
తీవ్ర తుఫానుగా మారిన బిపోర్‌జాయ్ ప్రస్తుతం గోవాకు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ముంబైకి 1,000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 3 రోజుల్లో ఇది ఉత్తరాన వాయువ్య దిశలో కదిలే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే బిపోర్‌జాయ్ కారణంగా అరేబియా తీర ప్రాంతాలకు ఎలాంటి ముప్పులేదని అధికారులు చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా తీరప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.