నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఎన్డీఏ వర్సెస్ ఇండియా
X
నేటి నుంచి ప్రారంభం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కానున్నాయి. ఈ రోజు నుంచి ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో జరగనున్న ఈ సమావేశాల్లో 21 కొత్త బిల్లులు, 7 పాత బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది కేంద్రం . యూనిఫామ్ సివిల్ కోడ్ పై పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో ఉంది. ఇక ఈ సమావేశాలకు అధికార NDA, విపక్ష INDIA కూటమి నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. తొలిరోజు నుంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మణిపుర్, దిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌర స్మృతి-యూసీసీపై ఉభయ సభలు దద్దరిల్లనున్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి గురువారం తొలి సమావేశం నిర్వహిస్తోంది. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో భేటీ నిర్వహించనున్నారు.
మణిపుర్ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడాలని విపక్షాలు భావిస్తున్నాయి.ఉమ్మడి పౌర స్మృతి, ఢిల్లీ ఆర్డినెన్సు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, సరిహద్దులో పరిస్థితులు వంటి ఇతర అంశాలూ చర్చకు వచ్చేలా చూడాలని, దానిపై వ్యూహరచనకు ప్రతిరోజూ సమావేశం కావాలని ప్రతిపక్ష శిబిరం నిర్ణయించింది.
బుధవారం అఖిలపక్ష సమావేశానికి 34 పార్టీల నేతలు హాజరై తమ డిమాండ్లను వినిపించారు. మణిపుర్ పరిస్థితులపై మొదటిరోజే ప్రధానమంత్రి ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. కులగణన, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి అంశాలపై.. చర్చ గురించి వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ప్రతి అంశంపై చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశ అనంతరం పార్లమెంట్ సజావుగా సాగేందుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశామన్నారు.