రూ.500 కోట్ల డైమండ్ గణేశ్...గుజరాత్‌లో ప్రత్యేక పూజలు
X
వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా భారీ భారీ గణేషుని విగ్రహాలు కొలువుదీరుతాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి వీది వినాయకుని మండపాలతో కళకళలాడుతుంటాయి. విజ్ఞాలను తొలగించే అధిపతి కావడంతో వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు పూజిస్తుంటారు. అయితే దేశంలో ఉన్న వినాయకులంతా ఒక ఎత్తైతే గుజరాత్‌లో మాత్రం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే వజ్ర గణపతి మరోఎత్తు. సూరత్‌కు చెందిన డైమండ్ వ్యాపారి కనుభాయ్ అసోదరియా ప్రతి సంవత్సరం వజ్ర గణపతికి, వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పూజలు చేస్తారు. అందులో భాగంగానే ఈ ఏడు డైమండ్ గణపతి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
కనుభాయ్ అసోదరియా దగ్గర కొలువుదీరిన గణపయ్య అత్యంత ఖరీదైన గణపతి. దీని ధర ఏకంగా రూ.500 కోట్లు ఉంటుందని సమాచారం. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ డైమండ్ గణపయ్య మరెక్కడా కనిపించడు . ఈ వ్యాపారి ఒక్కరి దగ్గరే ఉంటుంది. దానిని కూడా ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే బయటకు తీసి పూజలు చేసి భక్తులు దర్శించుకునేందుకు అనుమతి ఇస్తారు. 15 ఏళ్ల క్రితం ఓ పనిమీద బెల్జియం వెళ్లిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలను ఇండియాకు తీసుకువచ్చారు. ఈ వజ్రాల్లో ఓ వజ్రం గణపతి రూపంలో ఉన్నట్లు కనుభాయ్కి కల వచ్చింది. వెంటనే ఆ వజ్రాలను చూస్తే అందులో ఒక వజ్రం వినాయకుడి ఆకారంలో కనిపించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డైమండ్ గణేశ్‌ని కనుభాయ్ కుటుంబం పూజిస్తూ వస్తోంది.