Home > జాతీయం > ‘ఆధార్‌’పై మూడీస్‌ సంచలన ఆరోపణలు.. కేంద్రం రిప్లై ఇదే

‘ఆధార్‌’పై మూడీస్‌ సంచలన ఆరోపణలు.. కేంద్రం రిప్లై ఇదే

‘ఆధార్‌’పై మూడీస్‌ సంచలన ఆరోపణలు.. కేంద్రం రిప్లై ఇదే
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా ఇప్పుడు ఆధార్‌ తప్పనిసరి. ఈ ఆధార్‌పై ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్‌ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని.. అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని పేర్కొంది.ఇండియాలో ఉపయోగిస్తున్న సెంట్రలైజ్డ్ ఐడెటిఫికేషన్ సిస్టమ్‌లో పలు లోపాలున్నాయన్న మూడీస్... ఆధార్ సిస్టమ్స్ చాలా సార్లు సర్వీస్‌ను అందించలేక ఆగిపోతుందని పేర్కొంది. భారత్ వంటి అధిక ఉష్ణోగ్రత, చెమటలు ఎక్కువగా పట్టే దేశంలో బయోమెట్రిక్ టెక్నాలజీని నమ్ముకోవడం తప్పని చెప్పింది. ఆధార్‌ కార్డుపై ఉన్న 12 అంకెల బయోమెట్రిక్‌ టెక్నాలజీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందంటూ హెచ్చరించింది. తప్పుడు సమాచారంతో అనర్హులు లబ్ధి పొందుతుంటే, అర్హులు నష్టపోతున్నారని చెప్పింది. ముఖ్యంగా రేషన్‌ పంపిణీలో, గ్యాస్‌ సబ్సిడీలో బాధితులు అధికంగా ఉన్నారని చెప్పగా... ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది. అవన్నీ నిరాధారమని కొట్టిపారేసింది.

“ఆధార్ అనేది.. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ID. పదేళ్లుగా వంద కోట్లకు పైగా భారతీయులు దీనిపై విశ్వాసం ఉంచారు. తమ గుర్తింపును ధ్రువీకరించేందుకు 100కోట్ల సార్లకు పైగా దీన్ని వినియోగించారు. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయాలు నిరాధారమైనవి. ఒక నిర్దిష్ట పెట్టుబడిదారుల సేవ, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆధార్‌కు వ్యతిరేకంగా విస్తృతమైన వాదనలు చేసింది” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధార్‌ బయోమెట్రిక్‌ కోసం కేవలం వేలిముద్ర మాత్రమే కాకుండా, ఫేస్‌ అథెంటికేషన్‌, ఐరిస్‌ అథెంటికేషన్‌ వంటి కాంటాక్ట్‌లెస్‌ మార్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మూడీస్‌ విస్మరించిందని చెప్పింది. ఆధార్‌ డేటాబేస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదు. ఆ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు పార్లమెంట్‌ ముందు నివేదించామని UIDAI తమ ప్రకటనలో వివరించింది.

Updated : 26 Sept 2023 11:47 AM IST
Tags:    
Next Story
Share it
Top