Home > జాతీయం > కొండచరియలు విరిగిపడి 13 మంది గల్లంతు

కొండచరియలు విరిగిపడి 13 మంది గల్లంతు

కొండచరియలు విరిగిపడి 13 మంది గల్లంతు
X

ఉత్తరాఖండ్​లో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో పాటు మొత్తం 13 మంది గల్లంతయ్యారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. రుద్రప్రయాగ్​​ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో కీలకమైన గౌరీకుండ్‌లో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా విరిగిపడ్డ కొండచరియలు.. స్థానికంగా ఉన్న మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. దీంతో అందులో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో పాటు మొత్తం 13 మంది గల్లంతయ్యారు.





ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే, భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. బాధితులు బతికేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధితుల్లో చాలా మంది నేపాల్​ మూలాలున్నవారు ఉన్నారని స్థానికులు తెలిపారు. వీరంతా ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. గురువారం రాత్రి నుంచి సహాయక చర్యలు జరుగుతున్నా ఎలాంటి ఫలితం లేదని వారు వాపోయారు. బాధితులు మందాకిని నదిలో కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

గల్లంతైన వారిలో అమర్ బోహ్రా.. అతని భార్య అనితా బోహ్రా, వారి కుమార్తెలు రాధిక బోహ్రా, పింకీ బోహ్రాగా, కుమారులు పృథ్వీ బోహ్రా (7), జటిల్ (6), వకీల్ (3) ఉన్నారని అధికారులు తెలిపారు. వీరితో పాటు వినోద్ (26), ములాయం (25), అషు (23), ప్రియాంషు చమోలా (18), రణబీర్ సింగ్ (28) ఉన్నారని వారు వెల్లడించారు.

ఓ వైపు కొండచరియలు విరిగిపడగా.. మరోవైపు.. వర్షం కారణంగా మందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ జిల్లాలకు గురువారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో.. మూడు జిల్లాల్లోనూ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఇదే సమయంలో.. డెహ్రాడూన్, హరిద్వార్, పౌరీ, ఉధమ్ సింగ్ నగర్‌లలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.




Updated : 4 Aug 2023 11:29 AM IST
Tags:    
Next Story
Share it
Top