ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే సీఎం సంచలన నిర్ణయం
X
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే సంచలన నిర్ణయం తీసుకున్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ఆ రాష్ట్రంలోని దేవాలయాలు, మసీదులు, ఇతర మతపరమైన ప్రదేశాలలో నిర్దేశించిన పరిమితికి మించి లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించారు మోహన్ యాదవ్. అయితే ముఖ్యమంత్రి హోదాలో మోహన్ యాదవ్ సంతకం చేసిన తొలి ఉత్తర్వులు లౌడ్ స్పీకర్ ఆంక్షలకు సంబంధించినవే కావడం విశేషం.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసినట్లు అదనపు చీఫ్ సెక్రెటరీ (హోం) డాక్టర్ రాజేశ్ రాజోరా పేర్కొన్నారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. లౌడ్ స్పీకర్లు, డీజే సిస్టమ్ల శబ్దాలను మానిటర్ చేయడానికి ప్రతి జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.