PAN-Aadhaar Link: రూ.1000 ఫైన్ వద్దు.. నిర్మలా సీతారామన్‌కు కోమటిరెడ్డి లేఖ
X
గత నెల 30 వ తేదీతోనే పాన్ కార్డ్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ దాటిపోయింది. జూన్ 30 వ తేదిలోపు ఎవరైతే ఈ రెండింటిని లింక్ చేస్తారో వారి పాన్ కార్డులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలుపగా.. చాలామంది రూ.1000 ల జరిమానాతో హడావుడిగా పాన్-ఆధార్ లింక్ చేశారు. తాజాగా ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. గడువు తేదీ ముగిసినప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశంలో చాలామందికి పాన్-ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలియదని తన లేఖలో కోమటిరెడ్డి తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ సమస్యను కూడా ఎదుర్కొంటారని చెప్పారు. అలాంటి వారి పట్ల సానుభూతితో సానుకూలంగా వ్యవహరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది పాన్-ఆధార్ లింక్ చేయలేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని, అలా చూసుకుంటే జరిమానా రూపంలో వారందరి మీద మొత్తం రూ.30 వేల కోట్ల భారం పడుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సామాన్యుల గురించి ఆలోచించి తీసుకోవాలని ఆయన కేంద్రమంత్రి నిర్మలకు సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆర్థికమంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.