బాధితులకోసం ఎంపీలు సగం జీతం ఇవ్వాలి...వరుణ్ గాంధీ ట్వీట్
X
ఒడిశాలోని రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు తోటీ ఎంపీలు ముందుకు రావాలని బీజేపీ నేత వరుణ్ గాంధీ పిలుపునిచ్చారు. ఎంపీలందరూ తమ జీతంలో సగ భాగాన్ని రైలు ప్రమాద బాదిత కుటుంబాలకు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ." ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం హృదయ విదారకరం.. మన జీతంలో కొంత భాగాన్ని బాధిత కుటుంబాలకు ఇచ్చి వారిని ఆదుకోవాలని నా తోటి ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్లకి ముందు మద్దతు ఇవ్వాలి. తర్వాత న్యాయం జరగాలి" అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
శుక్రవారం రాత్రి ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ౩౦౦ మంది వరకు మృత్యువాత పడ్డారు.వెయ్యిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50,000 చొప్పున కేంద్రప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
రైలు బోగీల్లో మృతదేహాలు నుజ్జునుజ్జు కావడంతో పలువురిని గుర్తించడం కష్టంగా మారింది.ఇప్పటి వరకు 160 మృతదేహాలు గుర్తించలేదు. వాటిని భువనేశ్వర్ తరలిస్తున్నారు. మరోవైపు రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. అనంతరం కటక్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.