ముస్లిం యువతి రామభక్తి
X
ఏమిటీ, ఏదో తేడా కొడుతోందని ఆలోచిస్తున్నారా? ఒంటి మీద హిజాబ్ ఏమిటీ? వీపు వెనకాల కాషాయ జెండా ఏమిటి.. అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మ్యాటర్ అలా ఉంది మరి. ఈమె ముస్లిం యువతే. పేరు షబ్నమ్, ఊరు ముంబై. ఈమె గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. షబ్నం భుజంపై కాషాయ జెండా, వీపుకు రామమందిరం ఫోటో కట్టుకుని అయోధ్యకు కాలినడకన బయల్దేరింది. ఈమెకు శ్రీరాముడంటే విపరీతమైన భక్తి. అయోధ్యలో త్వరలో ప్రారంభం కాబోతున్న రామాలయానికి వెళ్లి తన ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి ఆమె పాదయాత్ర చేపట్టింది.
1,425 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించిన షబ్నమ్ రోడ్డుమీద వెళ్తుంటే జనం అవాక్కై చూస్తున్నారు. షబ్నమ్ వెంట హిందువులైన ఇద్దరు స్నేహితులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండే కూడా నడుస్తున్నారు. రోజుకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం నడుస్తున్న ఈ భక్తబృందం ప్రస్తుతం మధ్యప్రదేశంలో ఉంది. మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో వీరు వెళ్తున్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మహిళతో పోలీసుతో రక్షణ కల్పించింది.
తను ముస్లింను అయినా రాముడంటే తనకు అపార భక్తి విశ్వాసాలు ఉన్నాయని షబ్నమ్ చెబుతోంది. ‘‘నేను సనాతన ముస్లింను. నా మతం నా భక్తికి అడ్డుకాదు. నాకు చిన్నప్పట్నుంచి రామాయణం చాలా ఇష్టం. రామాయణం, మహాభారతాలు నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. శ్రీరాముడు నా ఆదర్శమూర్తి. అయోధ్యలోని రాంలాలాను చూడాలన్నది నా చిరకాల కోరిక. శ్రీరామచంద్రుడిని ఆరాధించడానికి హిందువై పుట్టాల్సిన అవసరం లేదు. మంచి మనిషిగా ఉంటే చాలు. రామభక్తికి ఎల్లలు లేవు. రాముడు అందరి దేవుడు’’ అని షబ్నమ్ అంటోంది. ఆమె రామభక్తిని ఇంట్లో వాళ్లు కూడా అడ్డుకోకుండా ప్రోత్సాహించారు. షబ్నమ్ అయోధ్యలో రాముడిని దర్శించుకున్న తర్వాత అక్కడికి సమీపంలోని ధనిపూర్‌లో నిర్మిస్తున్న మసీదుకు వెళ్తనుంది. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌ను కూడా కలుస్తానంటోంది.
షబ్నమ్ రామభక్తి, పాదయాత్రపై సోషల్ మీడియాలో కొందరు తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. కొందరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా ఆమె భయపడకుండా ముందుకే సాగిపోతోంది.