చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్.. 2024లో మళ్లీ గెలిస్తే..
X
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టించారు. అత్యధికకాలం పదవిలో ఉన్న రెండో ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును నవీన్ పట్నాయక్ వెనక్కి నెట్టారు. లిస్టులో ఫస్ట్ ప్లేస్లో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ ఉన్నారు. దేశంలో ఇప్పటి వరకు అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉంది. ఆయన 1994 డిసెంబర్12 నుంచి 2019 మే 27 వరకు 24 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించి నవీన్ పట్నాయక్ మరోసారి సీఎం పగ్గాలు చేపడితే అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా పవన్ చామ్లింగ్ రికార్డును తిరగరాయనున్నారు.
1997లో తండ్రి బీజూ పట్నాయక్ మరణంతో ఆయన వారసుడిగా నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి పేరుతో బీజూ జనతా దళ్ (బీజేడీ)ని స్థాపించారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 1998 నుంచి 2000 వరకు కేంద్రమంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా 2000 మార్చి 5న తొలిసారి ఆయన సీఎం బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా నేటితో 23 ఏళ్ల 138 రోజులు పూర్తిచేసుకున్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5 వరకు ఆ పదవిలో కొనసాగారు. 23 ఏండ్ల 137 రోజులు సీఎంగా పనిచేసిన రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాజాగా నవీన్ పట్నాయక్ ఆ రికార్డును తిరగరాశారు. వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లిస్టులోనూ చామ్లింగ్, జ్యోతి బాసు తర్వాత నవీన్ పట్నాయక్ నిలిచారు. 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వరుసగా ఆరోసారి సీఎం బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.