ఒడిశా రైలు ప్రమాదాన్ని..మొదట గుర్తించింది అతడే
X
title: ఒడిశా రైలు ప్రమాదాన్ని..మొదట గుర్తించింది అతడేఒడిశా రైలు ప్రమాదం..ప్రస్తుతం దేశమంతా చర్చించుకుంటున్న విషాద వార్త. మూడు రైళ్లు ఒకదానికొకటి ‘ఢీ’ కొనడంతో... 280 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. వేల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యావత్ దేశమంతా క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తూ.. మరణించిన వారికి సంతాపం తెలియజేస్తోంది. రైలు ప్రమాదం జరిగిన అరగంటలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలను హుటాహుటిన ప్రారంభించాయి. అయితే ఇంత వేగంగా సహాయక చర్యలు ప్రారంభం కావడానికి మాత్రం ఒకే ఒక్కరు కారణమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ జవాన్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించి నిమిషాల్లోనే లోకేషన్‌ను షేర్ చేయడంతో పాటు యాక్సిడెంట్ పిక్చర్లను హైయ్యర్ అఫీషియల్స్‌కు పంపించాడు.
బంధువు పెళ్లికి వెళ్లేందుకు వెంకటేశన్ అనే 39 ఏళ్ల జవాన్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. ట్రైన్ జర్నీ స్టార్ట్ కాగానే ఫోన్లో నిమగ్నమైపోయాడు వెంకటేశన్. రాత్రి 7 గంటల సమయంలో ఏదో భారీ శబ్దం వినిపించడంతో అలర్ట్ అయ్యాడు. ట్రైన్లో కుదుపులు రావడం ప్రయాణికులు పడిపోవడంతో ఏదైనా పేలుడు జరిగి ఉంటుందని భావించి వెంకటేశన్ వెంటనే రైలు నుంచి దిగి బయటపడ్డాడు. దిగిన వెంటనే ఏమైందని ఫోన్ లో టార్చ్ వేసి అక్కడ దృశ్యాలను చూసి షాక్ అయ్యాడు. వెంటనే తనవంతు బాధ్యతగా తనతో ప్రయాణిస్తున్న వారిలో కొందరిని కాపాడగలిగాడు. శబ్దాలతో ప్రమాద స్థలానికి వచ్చిన స్థానికులకు సూచనలు అందించాడు. ప్రమాద తీవ్రతను గుర్తించి వెంటనే తన పై అధికారులకు ఫోన్ చేసి సమాచారాన్ని చేరవేశాడు. లోకేషన్ షేర్ చేసి ఫోటోలను పంపించాడు.
వెంకటేశన్ ఫోన్ చేసిన పావుగంటలోనే ఎన్డీఆర్ఎఫ్ మొదటి బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనపై ఎన్డీఆర్‌ఎఫ్ డీఐజీ మొహిసీన్ షాహెది మాట్లాడుతూ.. ‘‘ప్రమాదం గురించిన సమాచారం మొదటిసారిగా మాకు ఎన్డీఆర్ఎఫ్ జవాన్ వెంకటేశన్ అందించాడు. విషయం అందిన వెంటనే మా హెడ్‌క్వార్టర్స్‌లోని సీనియర్ అధికారి అలర్ట్ అయ్యారు. పావుగంటలోనే ప్రమాదం జరిగిన బాలేశ్వర్‌కు తొలి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం చేరుకుంది. అనంతరం మిగతా బృందాలు ఒక్కొక్కటిగా ఘటనా స్థలానికి వచ్చాయి. మా 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది" అని తెలిపారు.