DMK MLA’s Son : దళిత యువతిపై వేధింపులు.. ఎమ్మెల్యే కొడుకు కోసం వెతుకులాట
X
దళిత యువతిపై దాడి చేశారన్న ఆరోపణలపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎమ్మెల్యే కుమారుడు, కోడలుపై చెన్నై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఐదు రోజులైనా, ఇంకా అరెస్టు కాలేదు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం నిందితులైన ఆండ్రో మదివణన్, మెర్లినా దంపతులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారని తెలిసింది. కాగా ఈ కేసులో నిందితులిద్దరూ సైదాపేట కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మదివణన్, మెర్లినా దంపతులు తమ ఇంట్లో పని చేసే యువతిని వేధించినట్లు ఫిర్యాదు రావడంతో నీలాంగరై ఆల్ ఉమెన్ పోలీసులు వారిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంటి పనులు చేస్తున్నా వారు యువతిని హింసించేవారని, వారితో పాటు ముంబయి వెళ్లినప్పుడు సరిగ్గా వంట చేయలేదని దాడిచేశారని, పచ్చి మిరపకాయ తినిపించి హింసించినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా వాతలు పెట్టి రక్తం కారేలా కొట్టేవారని, మూడేళ్లు అక్కడే ఉండి పనిచేయాలని సంతకం చేయించుకున్నారని, బయటకు వెళ్తే ఆమె తల్లిని ఏమైనా చేస్తామని బెదిరించారని, కులం పేరుతో తరచూ దాడి చేసి చిత్రహింసలకు గురిచేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది.