Home > జాతీయం > కూలిన ఇండ్లు, జనం పరుగులు.. చిగురుటాకులా వణికిన నేపాల్..

కూలిన ఇండ్లు, జనం పరుగులు.. చిగురుటాకులా వణికిన నేపాల్..

కూలిన ఇండ్లు, జనం పరుగులు.. చిగురుటాకులా వణికిన నేపాల్..
X

మంగళవారం మధ్యాహ్నం వరుస భూకంపాలతో నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. గంట వ్యవధిలోనే 4సార్లు భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. మధ్యాహ్నం 2.25గంటల సమయంలో 4.6తీవ్రతో తొలి భూకంపం వచ్చింది. ఆ తర్వాత మరో 25 నిమిషాలకు మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.2గా నమోదైంది. రెండో భూకంపం వచ్చిన 15 నిమిషాలకు 3.8 తీవ్రతతో మరొకటి, మరో 13 నిమిషాలకు 3.1 తీవ్రత కలిగిన మరో భూకంపం వచ్చింది. భూమికి 5కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. భూకంపం కారణంగా భజంగ్ జిల్లాలో భారీ నష్టం జరిగింది. చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్నింటికి బీటలు వారాయి. అయితే ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు.

నేపాల్ భూకంప ప్రభావం భారత్ ను తాకింది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 3.27 గంటల సమయంలో అరుణాచల్ ప్రదేశ్లో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. కాసేపటికే ఉత్తరాఖండ్ లో 3.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్ కు 206 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం ఇండ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనల ధాటికి ఇళ్లలోని ఫ్యాన్లు ఊగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూకంపం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన జారీ చేశారు. జనం లిఫ్టులు వాడొద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 112కు కాల్ చేయాలని చెప్పారు.

నేపాల్ భూకంప ప్రభావంతో ఉత్తర్ ప్రదేశ్లోనూ భూమి కంపించింది. లక్నో, హపూర్, అమ్రోహాతో పాటు ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. చండీఘడ్, జైపూర్తో పాటు ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది.

Updated : 3 Oct 2023 12:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top