Home > జాతీయం > 'ఇండియన్ రైల్వేస్ వేస్ట్'... దీపావళి ప్రయాణికుడి అక్కసు

'ఇండియన్ రైల్వేస్ వేస్ట్'... దీపావళి ప్రయాణికుడి అక్కసు

ఇండియన్ రైల్వేస్ వేస్ట్... దీపావళి ప్రయాణికుడి అక్కసు
X

పండుగ వేళ సొంతూరికి వెళ్లాలనుకుని ముందుగానే ప్లాన్లు వేసుకుంటాం. అందుకు తగ్గట్టుగానే రద్దీని బట్టి ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటాం. రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ అయినప్పటికీ.. వెయిటింగ్‌ లిస్టులో ఉన్నవారో, జనరల్ టికెట్‌ తీసి రిజర్వేషన్‌ బోగీ ఎక్కినవారో ఎవరో ఒకరొచ్చి పక్కన కూర్చుంటారు. పోనీలే మనలాగే పండుగకు ఊరు వెళ్తున్నాడని వద్దని చెప్పేందుకు అంత ఈజీగా నోరు పెగలదు. మొహమాటం అడ్డొచ్చి ఆగిపోతాం. స్లీపర్‌ క్లాస్‌ బుక్ చేసుకున్నవారందరికీ దాదాపు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి ఈ సమస్య అంతగా ఉండదు. కానీ, దీపావళి (Diwali) సందర్భంగా గుజరాత్‌లోని వడోదర నుంచి మధ్యప్రదేశ్‌లోని రత్లాం వెళ్తున్న అన్షుల్‌ శర్మ అనే ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది.

థర్డ్‌ ఏసీ టికెట్‌ బుక్ చేసుకున్నా కూడా.. కంపార్ట్‌మెంట్ లోపలికి వెళ్లలేని పరిస్థితి. కనీసం లోపలికి అడుగు పెట్టడానికి వీలులేకుండా ద్వారం వద్ద ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. తన టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యిందని, లోపలికి వెళ్లేందుకు సహకరించాలని అక్కడి ఆర్పీఎఫ్‌ సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. నీ ఒక్కడి కోసం అంతమంది జనాన్ని పక్కకు నెట్టి దారివ్వడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో ఒళ్లుమండిన అన్షుల్‌ ట్విటర్‌ వేదికగా ఇండియన్‌ రైల్వేస్‌పై మండిపడ్డారు. ఇంత పనికిమాలిన నిర్వహణను ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ నన్ను దీపావళి పండగ చేసుకోనివ్వనందుకు ధన్యవాదాలు. థర్డ్‌ ఏసీలో కన్ఫర్మ్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తిని ట్రైన్‌ ఎక్కనివ్వకుండా చేశారు. భద్రతాదళసిబ్బంది నుంచి ఎలాంటి సహకారం అందలేదు. నా లాంటి చాలా మంది ప్రయాణికులది ఇదే పరిస్థితి’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. టికెట్‌ డబ్బులు రూ.1,174 వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. రైల్వే సిబ్బందికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి.. ఎఫ్‌ఐఆర్‌తో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలని సలహా ఇస్తున్నారు.

Updated : 14 Nov 2023 10:39 AM IST
Tags:    
Next Story
Share it
Top