పింక్ చొక్కాలు.. ఖాకీ ప్యాంట్లు.. పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్
X
పార్లమెంట్ సమావేశాలకు వేలయింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది, ఉద్యోగులు ప్రత్యేక యూనిఫాం ధరించనున్నారు. భారతీయత ఉట్టిపడేలా ఈ డ్రెస్ కోడ్ ఉండనుంది. నెహ్రూ జాకెట్, ఖాకీ పాంట్ లతో యూనిఫాంలో మార్పులు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 19న వినాయక చవితి సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనంలోకి లాంఛనంగా సభ ప్రవేశించనుంది. ఈ సమావేశాల్లో ఉద్యోగులు వేసుకునే దుస్తులను నిఫ్ట్ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) రూపొందించింది.
బ్యూరోక్రాట్లకు సూట్ స్థానంలో పింక్ కలర్ నెహ్రూ జాకెట్ రానుంది. షర్ట్ లు కూడా పింక్ కలర్, లోటస్ ఫ్లవర్ డిజైన్ తో ఉన్నాయి. ఉద్యోగులు ఖాకీ రంగు ప్యాంట్ వేసుకోనున్నారు. మార్షల్స్ దుస్తులు కూడా మారుతాయి. ఇకపై మార్షల్స్ మణిపూర్ తలపాగా ధరిస్తారు. అంతేకాకుండా పార్లమెంట్ భవనంలోని భద్రతా సిబ్బంది డ్రెస్ కోడ్ కూడా మారనుంది. సఫారా సూట్ కు బదులుగా మిలిటరీ తరహా దుస్తులు ఉంటాయి.