తేడా పార్టీలు.. శివసేన, ఎన్సీపీలది ఎన్డీఏయూపీఏ కూటమి..
X
పతనానికి చేరిన దేశ రాజకీయాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. విలువలకు తిలోదకాలిస్తూ రక్తికట్టించే జగన్నాటకం సాగుతోంది. ఇటీవల కాలంలో బహుశా ఏ పార్టీ చరిత్రలోనూ జరగని పరిణామాలతో రెండు పార్టీలు పరువు తీసుకుంటున్నాయి. రెండూ ఒకే రాష్ట్రానివి కావడంతోపాటు, రెండూ ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించినవే. కుటుంబ పార్టీలుగా దిగజారిపోయి, రోజురోజుకూ భ్రష్టుపట్టి, ముక్కచెక్కలై స్వార్థ రాజకీయాల్లో తమను మించిన పార్టీలేవీ లేవని రొమ్ము విరుచుకుంటున్నాయి. అవును, ఇదంతా శివసేన ఎన్సీపీల గురించే!!
మంగళవారం అటు ఢిల్లీలో జరుగుతున్న అధికార ఎన్డీఏ కూటమిలోనూ, ఇటు బెంగళూరులో సాగుతున్న యూపీఏ సారథ్యంలోని విపక్షాల కూటమిలలోనూ శివసేన, ఎన్సీపీలు పాల్గొంటున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఎన్డీఏతో, ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) యూపీఏతోనూ జోడీ కట్టాయి. శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం) ఎన్డీఏతో, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) యూపీఏతో దోస్తానీ చేస్తోంది. ఢిల్లీకి అజిత్ పవార్, ఏకనాథ్ షిండేలు బెంగళూరుకు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు హాజరయ్యారు. శివసేన, ఎన్సీపీల్లో ఇప్పటికే సైద్ధాంతికంగా చీలికలు లేకపోయినా ఆధిపత్య పోరులో చీలిలో అధికా, విపక్షాల పంచన చేరాయి.
మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన అంతర్గత కుమ్ములాటలో చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే మతరాజకీయాల పరంగా భావసారూప్యమున్న బీజేపీని వదిలేసి ‘సెక్యులర్’ కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. సెక్యులర్ అని చెప్పుకునే ఎన్సీపీ అజిత్ పవార్ మతతత్వ బీజేపీ, శివసేనలతో జట్టుకట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. యూపీఏ సాయంతో బీజేపీ, షిండేలను దెబ్బకొట్టి మళ్లీ సీఎం కావాలన్నది ఉద్ధవ్ ఠాక్రే ప్లాన్. ఈ రెండు పార్టీల నాలుగు చీలికల ఏకైక ధ్యేయం అధికారం. 80వ పడిలో ఉన్న శరద్ పవార్‌కు ప్రధాని పదవిపై ఇప్పటికీ ఆశచావక, యూపీఏ దయ కోసం అర్రులు చాస్తున్నారు.
మరోపక్క.. యూపీఏ, ఎన్డీఏలు వీటిని అవసరానికి పనికొచ్చే పార్టీలుగా చూస్తున్నాయి. తమ వ్యూహాలకు తగ్గట్టు ఆ చీలిక వర్గాల్లో ఏదో ఒకదానికి మద్దతిచ్చి, మరోదాన్ని దెబ్బతీయడం ఈ జాతీయ కూటముల ట్రేడ్ మార్క్. మోదీని ఎలాగైనా గద్దెదింపాలని కంకణం కట్టుకున్న యూపీఏ సారథి కాంగ్రెస్ ఎలాంటి నీతినియమాలూ లేని పార్టీలను, రారామ్మని పిలుస్తోంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్న ఎన్డీఏ కూడా ఏమాత్రం విలువలు పాటించకండా ఒకప్పుడు మతోన్మాద పార్టీ, హంతక పార్టీ అని తమను తిట్టినవాళ్లను బిగియారా నిస్సిగ్గుగా కౌగిలించుకుంటోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నితీశ్ కుమార్, కుమారస్వామి లాంటి నాయకులు యూపీఏ, ఎన్డీఏలతో చేసే పనిని వర్ణించడానికి మాటల్లేవు. ఎన్నికలకు ఇంకా 10 నెలల గడువు ఉండగానే ఇన్ని చిత్రాలు జరుగుతుంటే ఇక ఎన్నికల సమయంలో మరెన్ని ఘోరాలు జరుగుతాయో ఊహించుకోవడం కష్టమేమీ కాదు.