దేశవ్యాప్తంగా NIA సోదాలు.. పీఎఫ్ఐ కార్యకర్తలే టార్గెట్
X
నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యకర్తలే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దేశవ్యాప్తంగా ఆకస్మిక సోదాలు చేపట్టింది. 2022లో బిహార్లో పర్యటించిన ప్రధాని మోదీపై దాడికి యత్నించిన కేసు సహా ఇతర కేసులకు సంబంధించి కర్ణాటక, కేరళ, బిహార్‌లోని దాదాపు 25 ప్రాంతాల్లో బుధవారం దాడులు నిర్వహించింది. ఈ ఉదయం నుంచే.. దక్షిణ కన్నడ జిల్లాలో సోదాలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 16 ప్రదేశాల్లో PFI కార్యకర్తలకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్పత్రులపై దాడులు చేస్తున్నట్లు వెల్లడించాయి. మంగళూరు, పుత్తూరు, బెల్తాంగడి, ఉప్పినాంగడి, వెనూర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో NIA అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పలు డిజిటల్ డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ అధికారులకు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
బీహార్ రాజధాని పాట్నాలోని ఫుల్వరి షరీఫ్ ప్రాంతంలో ఈ సంస్థ సభ్యులు సమావేశమవుతున్నారని, దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు వ్యూహాలు రచిస్తున్నారని NIA కి సమాచారం అందింది. దీంతోనే NIA సోదాలు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4-5 తేదీల్లో బిహార్ మోతిహరిలోని ఉగ్రసంస్థకు సంబంధించిన ఎనిమిది ప్రదేశాల్లో దర్యాప్తు బృందం దాడులు చేసింది. ఈ క్రమంలో పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. పట్నాలో కూడా గతేడాది జూలై 12న పీఎఫ్ఐపై నమోదైన కేసులో ఆరుగురిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.