వీఐపీ వాహనాల్లో సైరన్లకు స్వస్తి.. వాటితో రిప్లేస్ చేస్తాం : గడ్కరీ
X
గతంలో వీఐపీ వాహనం అంటే పైన ఎర్ర బుగ్గ, లోపల సైరన్ ఉండేది. కొన్నేళ్ల క్రితం పైనున్న రెడ్ లైట్ ను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో వీఐపీ వాహనల్లో సైరన్ మాత్రమే ఉంది. వీఐపీ వాహనాలు వెళ్లేటప్పుడు సైరన్ వేసుకుంటూ వెళ్తారు. వీఐపీలు వాహనాల్లో లేకున్నా ఈ సైరన్లు మాత్రం ఆగవు. కొందరు చోటా మోటా లీడర్లు సైతం సైరన్లు పెట్టుకుని హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సైరన్ల సమస్యకు చెక్ పెడుతూ.. కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వాహనాల సైరన్ మోతను వినసొంపుగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. సౌండ్ పొల్యూషన్ను తగ్గించేందుకు ఈ కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన చాందినీ చౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వీఐపీ వాహనాలపై ఉండే ఎర్రబుగ్గ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు దక్కింది. ఇప్పడు వీఐపీ వాహనాల్లో సైరన్ కూడా తొలగించాలని అనుకుంటున్నాం. దీని కోసం కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నాం. సైరన్‌కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, వయోలిన్,తబలా, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేస్తున్నాం’’ అని గడ్కరీ తెలిపారు.