Nitish Kumar : ఇవాళ సీఎం పదవికి నితీష్ రాజీనామా.. బీజేపీతో కలిసి..
X
బిహార్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ తన కూటమిని మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని వీడి ఆయన బీజేపీతో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత నితీష్ రాజీనామా చేస్తారని సమాచారం. మధ్యాహ్నం 12గంటలకు గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. సాయంత్రం 4గంటలకు బీజేపీ సపోర్ట్ తో మళ్లీ సీఎం ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది.
సీట్ల పంపకాల విషయంలో జేడీయూ-బీజేపీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీజేపీకి స్పీకర్ పదవితోపాటు రెండు డిప్యూటీ సీఎంలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు రేణు దేవి, సుశీల్ మోడీలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేస్తారని సమాచారం. జేడీఎల్పీ సమావేశం తర్వాత ఎన్డీఏ సమావేశం జరగనుంది. మరోవైపు ఇవాళ బిహార్కు అమిత్ షా, జేపీ నడ్డా వెళ్తున్నారు. నితీష్ ప్రమాణ స్వీకారంలో వీరు పాల్గొనే అవకాశం ఉంది.
అటు ఆర్జేడీ సైతం అధికారం కోసం పావులు కదుపుతోంది. బీహార్ అసెంబ్లీలో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీయూ 45, ఆర్జేడీ 79, బీజేపీకి78, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు ఉన్నాయి. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ దాటాలంటే 122 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆర్జేడీకి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్ధతు ఉన్నా.. 10 మంది ఎమ్మెల్యేల వరకు తక్కువపడుతున్నారు. మరోవైపు నితీష్ వెంటే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో బిహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.