Madras High Court : ఆలయాలేమీ పిక్నిక్ స్పాట్లు కావు...మద్రాస్ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు
X
(Madras High Court) మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మతస్తులైనా వచ్చి పోయేందుకు హిందూ ఆలయాలేమీ పిక్నిక్ స్పాట్లు కావంటూ తెలిపింది. హిందూయేతరులను టెంపుల్ ఎదుట ఉండే ధ్వజస్తంభం వరకే అనుమతించాలని తేల్చి చెప్పింది. అయితే హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్తుల ప్రవేశాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా ఆలయాల ఎదుట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ శాఖ అధికారులను ఆదేశించింది.
తమిళనాడులోని అర్లుమిగు పళని ధండాయుధపాణి స్వామి ఆలయంలోకి హిందువులు కాకుండా ..ఇతర మతస్తులు ఆలయంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ డి.సెంథిల్ కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోని ఇతర మురుగన్ టెంపుల్స్ లో కూడా హిందువులను మాత్రమే అనుమతించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ విచారణ చేపట్టింది.
జస్టిస్ ఎస్. శ్రీమతి నేతృత్వంలోని బెంచ్.. పిటిషన్ దారుడి వాదనతో ఏకీభవిస్తూ ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించాలని తెలిపింది. ఇతర మతస్తులను టెంపుల్ లోని ధ్వజస్తంభం వరకు అనుమతించవచ్చని సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతీ ఆలయం ముందు బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా దర్శనానికి వచ్చినపుడే లోపలికి అనుమతించాలని జస్టిస్ ఎస్ శ్రీమతి ప్రభుత్వానికి తెలిపింది.