Nobel Peace Prize: మహిళల అణచివేతపై పోరాడిన యోధురాలికి నోబెల్
X
నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదిని వరించింది. ఇరాన్ మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు గానూ ఈ అవార్డ్ ఆమెను వరించింది. మానవ హక్కులు, ప్రతి ఒక్కరి స్వేచ్చ కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న నార్గిస్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుంది. నార్గిస్ చదువుకునే రోజుల నుంచి మహిళా హక్కులపై గలమెత్తారు. ఆ అణచివేతలోనే ఇంజినీరింగ్ పూర్తిచేసిన నార్గిస్.. కొంతకాలం పలు వార్తాపత్రికల్లో కాలమిస్ట్ గా పనిచేశారు. 2003లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (డీహెచ్‌ఆర్‌సీ) సెంటర్‌లో చేరిన నార్గిస్.. కొంతకాలం తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
మహిళా హక్కుల కోసం పారాడిన నార్గిస్ అనేకసార్లు జైలుకు వెళ్లారు. దాదాపు 13సార్టు అరెస్ట్ అయ్యారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నార్గిస్ తొలిసారి అరెస్ట్ అయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆమెకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత రెండేళ్లకు బెయిల్ పై బయటికి వచ్చి.. విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. దీంతో 2015లో నార్గిస్ ను మరోసారి జైలుకు పంపించారు. జైల్లోనూ ఆమె పోరాటాన్ని కొనసాగించింది. జైల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా పోరాడింది. దాంతో ఆమెపై కఠిన చర్యలు చేపట్టారు జైలు అధికారులు. అయినా వెనకడుగు వేయని నార్గిస్.. తన పోరాటాన్ని కొనసాగించింది. జైల్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. అక్కడి నుంచే సంచలన నివేదికలు రాసి పత్రికలకు పంపించేది. అలా ఆమె రాసిన కథనాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి పత్రికల్లో వచ్చాయి.