Home > జాతీయం > Manipur : మణిపూర్‌లో ఆగని హింస.. ఏడుగురి మృతి

Manipur : మణిపూర్‌లో ఆగని హింస.. ఏడుగురి మృతి

Manipur : మణిపూర్‌లో ఆగని హింస.. ఏడుగురి మృతి
X

మణిపూర్‌లో మళ్లీ అల్లరు చెలరేగాయి. బిష్ణుపూర్ జిల్లాల్లో మరో నలుగురు హత్యకు గురయ్యారు. వీరితో కలుపుకొని తాజా హింసలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. మోరే గ్రామంలో ఇద్దరు పోలీసులను దుండుగలు హత్య చేశారు. మరో గ్రామంలో దుండగులతో జరిగిన ఎదురుకాల్పుల్లో విలేజ్ వలంటీర్ మృతి చెందాడు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య కొన్ని నెలల క్రితం మొదలైన హింసాత్మక ఘటనలు ఆగడంలేదు. తాజా ఘటనల నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అత్యవసరమున్న వారినే బయటకు అనుమతిస్తున్నారు. ఇంఫాల్‌ ఈస్ట్‌, ఇంఫాల్‌ వెస్ట్‌, కాంగ్‌పోక్పి, బిష్ణుపూర్‌ జిల్లాల్లోనూ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

బిష్ణుపూర్‌ జిల్లాలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో తండ్రీకొడుకులతో పాటు మరో ఇద్దరు చనిపోయారు. అలాగే కాంగ్‌పోక్పి జిల్లా కాంగ్‌చుప్‌ గ్రామంలో జరిగిన కాల్పుల్లో గ్రామ వాలంటీర్‌ మృతి చెందాడు. పౌరుల మృతిని నిరసిస్తూ మహిళలు ఇంఫాల్‌లో గురువారం సీఎం బంగ్లా మీదుగా, రాజ్‌భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. భద్రతా బలగాల యూనిఫైడ్‌ కమాండ్‌ అధికారిని తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. రాజ్‌భవన్‌కు 300మీటర్ల దూరంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. రిజర్వేషన్ల విషయంలో కుకీలు, మెయిటీలకు మధ్య రేకెత్తిన అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 175 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. తాజాగా గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజా ఘర్షణల నేపథ్యంలో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.




Updated : 19 Jan 2024 7:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top