Bihar Train Accident : పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. ఏడుగురు మృతి
X
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యాకు వెళ్తోన్న నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. (Bihar Train Accident) ఈ ప్రమాదంలో రైలు ఆరు బోగీలు ఒకదానిపై ఒకటి చెల్లాచెదురుగా పడ్డాయి. బుధవారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో బీహార్‌లోని డానాపూర్-బక్సర్ రైల్వే సెక్షన్ రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
దుమ్రాన్ SDO కుమార్ పంకజ్, బ్రహ్మపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు సహాయక చర్యల కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సామాన్య ప్రజలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదాంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వెంటనే ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌కుసూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు తెలిపారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించామని, క్షతగాత్రుల్ని పట్నాలోని ఎయిమ్స్‌కి తరలిస్తామన్నారు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరో 70 మంది గాయాలపాలయ్యారని.. వారిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. రైలు ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. పాట్నా: 9771449971, ధన్‌పూర్: 8905697493, కమాండ్ కంట్రోల్: 7759070004, ఆరా : 8306182542 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.