Home > జాతీయం > Bengaluru: మెట్రో సిబ్బంది అత్యుత్సాహం.. పేద రైతుకు అవమానం

Bengaluru: మెట్రో సిబ్బంది అత్యుత్సాహం.. పేద రైతుకు అవమానం

Bengaluru: మెట్రో సిబ్బంది అత్యుత్సాహం..  పేద రైతుకు అవమానం
X

పెద్ద పెద్ద చదువులు చదివినా, ఉన్నత ఉద్యోగాలు సంపాదించినా.. సాటి మనిషి పట్ల ప్రవర్తించే తీరును బట్టే మన సంస్కారం ఏంటో తెలుస్తుందంటారు. స్థాయిని అంచనా వేసి ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూడటం, వారిని నిరాదరణకు గురిచేయడాన్ని సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమంటారు. అదిగో అచ్చం అలాగే ప్రవర్తించారు బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) అధికారులు. వారి అత్యుత్సాహం ఓ రైతును అవమానానికి గురి చేసింది.

కర్ణాటకకు చెందిన ఓ రైతు తన బ్యాగ్‌తో రాజాజీనగర్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కడానికి వెళ్లాడు. ఆయన టికెట్ తీసుకున్న అనంతరం సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు రాగానే రైతును భద్రతా సిబ్బంది నిలిపేశారు. మెట్రో ఎక్కడానికి అనుమతించలేదు. తెల్ల చొక్కా ధరించి, తలపై బట్టల మూటతో ఉండటంతో ఆయన మెట్రోలో ప్రయాణించడానికి వీల్లేదని సిబ్బంది అడ్డుకున్నారు. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు.

ట్రాఫిక్‌ నగరంగా పేరు గాంచిన బెంగళూరు మహానగరంలో ప్రజలు ఎక్కువగా మెట్రో రవాణానే అనుసరిస్తుంటారు. ఉద్యోగులు, సామాన్యులు ఇలా నిత్యం లక్షల మంది మెట్రో రైలులో రాకపోకలు సాగిస్తుంటారు. ఓ రైతు కూడా మెట్రో రైలు ఎక్కేందుకు ఆదివారం బెంగళూరులోని రారాజీనగర్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, ఆ రైతును సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ అడ్డుకున్నాడు. తన వస్త్రధారణ కారణంగా (బట్టలు మురికిగా ఉన్నాయని) రైతును లోపలికి అనుమతించలేదు. టికెట్‌ ఉందని రైతు చూపించినప్పటికీ ఆయన్ని లోపలికి రావడాన్ని నిరాకరించాడు. సెక్యూరిటీ గేటు వద్ద ఆపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ ఘటన వివాదాస్పదమైంది.

వీడియో చూసిన నెటిజన్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బెంగళూరు మెట్రోను దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. #BengaluruMetroOnlyforVIP హ్యాష్‌ట్యాగ్‌తో విరుచుకుపడ్డారు. ‘నమ్మశక్యం కానిది..! మెట్రో కేవలం వీఐపీలకు మాత్రమేనా..?’, ‘మెట్రో రైల్లో ప్రయాణించాలంటే డ్రెస్‌ కోడ్‌ ఉండాలా..?’ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రైతును అవమానించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆ వీడియోని బెంగళూరు మెట్రో యాజమాన్యానికి ట్యాగ్‌ చేశారు.

విమర్శల నేపథ్యంలో బీఎంఆర్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్పందించారు. రైతు పట్ల అవమానకరంగా ప్రవర్తించిన సదరు సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. మెట్రో ప్రయాణం కోసం నిర్దిష్ట దుస్తులను తప్పనిసరి చేసే నియమం ఏదీ లేదని తెలిపారు. ఇలా వేషధారణ కారణంగా ప్రవేశాన్ని తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

Updated : 26 Feb 2024 9:32 PM IST
Tags:    
Next Story
Share it
Top