రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు : శరద్ పవార్
X
యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభం కానున్నాయి. 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45కు ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఎంతోమంది ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఈ మహోత్సవంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని శరద్ పవార్ చెప్పారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్నారా అన్న మీడియా ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. మోదీ
సర్కార్ రామ మందిరాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. ఏదిఏమైన అందరి సహకారంతో రామ మందిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగా వందలాది మంది ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.