మఫ్టీలో వచ్చిన పోలీసులు.. హర్యానా అల్లర్ల ప్రధాన నిందితుడి అరెస్టు
X
గత నెల 31 న హరియాణాలోని నూహ్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణలకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడైన గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తావడూ పట్టణంలో భారీ చేజింగ్‌ల నడుమ అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజీలో మఫ్టీలో ఉన్న పోలీసులు.. కర్రలు, తుపాకుల వంటి ఆయుధాలతో చాలాసేపు వెంబడించిన తర్వాత అతడిని పట్టుకోవడం కనిపిస్తోంది.
బిట్టూ బజరంగీ అలియాస్ రాజ్‌కుమార్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. గత మూడేళ్లుగా గో సంరక్షణ సంస్థను నడుపుతున్నాడు. హరియాణా అల్లర్లకు సంబంధించి అతనిపై హింస, బెదిరింపులు, ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, ప్రభుత్వ అధికారిని విధుల నుంచి తప్పించడం, మారణాయుధంతో హాని కలిగించడం వంటి అభియోగాలు ఉన్నాయి. ఓ హోం గార్డు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 70 మందికిపైగా గాయపడ్డారు. వాహనాలకు నిప్పంటించిన ఆందోళనకారులు.. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ ఘటనలతో నూహ్‌లో రెండు వారాల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా.. సోమవారం పునరుద్దరించారు.
అల్లర్లకు సంబంధించి బజరంగీపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌తో పాటు.. , సాదర్ పీఎస్ లో ఏసీపీ ఉషా కుందు ఫిర్యాదు ఆధారంగా దాఖలైన మరో 15 నుంచి 20 కేసుల్లోనూ అతడిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బజరంగీని తావడూ పట్టణంలోని నేర దర్యాప్తు విభాగం అదుపులోకి తీసుకుందని, ఫరీదాబాద్‌కు తరలించామని తెలిపారు. అలాగే, అందుబాటులో ఉన్న వీడియోల ఆధారంగా అతడి అనుచరులను గుర్తించే పనిలో ఉన్నట్టు చెప్పారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.
మరోవైపు, నూహ్ పోలీస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. బిట్టూని ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేశామని, బుధవారం అతడ్ని కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు. ‘పోలీసుల విధులకు ఆటంకం కలిగించేవారిని ఉపేక్షించం.. సోషల్ మీడియాపై కూడా నిఘా ఉంచాం.. రెచ్చగొట్టేలా విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. నూహ్‌లో వీహెచ్‌పీ ఊరేగింపుపై దాడి జరిగిన సమయంలో బజరంగీ, అతని అనుచరులు అక్రమ ఆయుధాలను ఉపయోగించారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
VIDEO | Bittu Bajrangi, a Bajrang Dal member, has been arrested in connection with violence in Haryana's Nuh.
— Press Trust of India (@PTI_News) August 15, 2023
(Source: Third Party) pic.twitter.com/SC04SydgiY