Home > జాతీయం > ఒడిశా సర్కార్ కొత్త పథకం.. లారీ డ్రైవర్లకు ఫ్రీ చాయ్

ఒడిశా సర్కార్ కొత్త పథకం.. లారీ డ్రైవర్లకు ఫ్రీ చాయ్

ఒడిశా సర్కార్ కొత్త పథకం.. లారీ డ్రైవర్లకు ఫ్రీ చాయ్
X

లారీ డ్రైవర్ల కోసం ఒడిషా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రివేళ కాసేపు విశ్రాంతి తీసుకుని వెచ్చగా కాస్తంత చాయ్ కడుపులో పోసుకుని, తిరిగి లారీ ఎక్కేలా ఒడిశా ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. రాత్రుళ్లు రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లకు హోటళ్లు, దాబాలలో ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి టుకుని సాహు వెల్లడించారు. రాత్రివేళ డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని, వాటిలో డ్రైవర్లు నిద్రపోవడానికి, స్నానాలకు సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. అక్కడ కూడా చాయ్, కాఫీ వంటివి అందుబాటులో ఉంటాయని చెప్పారు.

గురువారం మంత్రి తుకుని సాహు విలేకరులతో మాట్లాడుతూ… ‘హైవేలపై తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది మృతి చెందుతున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని ఇప్పటికే జనచైతన్యం కల్పిస్తున్నాం. సరకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేమితో ఉంటుంటారు. ఆ సమయంలో రెప్పపాటుతో దుర్ఘటనలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రహదారుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది’ అని తెలిపారు. ఈ పథకం అమలులో భాగంగా తొలుత రోజూ రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ ఛాయ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు.




Updated : 22 Dec 2023 12:14 PM IST
Tags:    
Next Story
Share it
Top