ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. CSR రిపోర్ట్!!
X
ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్ జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం (Odisha Train Tragedy) తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. సరిగ్గా నెల క్రితం(జూన్ 2 న) జరిగిన ఈ ఘటనలో 293 మంది మృతి చెందారు. కాగా ఈ రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) తన నివేదికను సమర్పించారు. ఆ రిపోర్ట్ లో.. సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ బాధ్యతల్లో ఉన్న ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుపుతూ.. సీఆర్ఎస్ ఉన్నతాధికారులకు ఆ నివేదికను అందజేసింది. ఈ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర ఉందా అనే విషయమై సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున సేఫ్టీ కమిషన్ ఆ రిపోర్ట్ ను బయటపెట్టడం లేదు. "సిబిఐ విచారణ జరుగుతున్నందున మేము CRS నివేదికపై ఏ విషయాలను బయటపెట్టదలుచుకోలేదు. ఈ నివేదిక.. మరేతర నివేదికను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా లేదా జోక్యం చేసుకోకుండా చూసుకుంటున్నాం. రెండు నివేదికలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా మరో రిపోర్ట్ ను రూపొందిస్తాం. ఘటనపై మొత్తంగా రీసెర్చ్ చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు ప్రమాదం సంభవించిన సౌత్ ఈస్టర్న్ రైల్వేకు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులను రైల్వే శాఖ బదిలీ చేసింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో జనరల్ మేనేజర్ అర్చన జోషిని బదిలీ చేస్తూ ఆమె స్థానంలో అనిల్‌కుమార్ మిశ్రను నియమిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.అంతకుముందు ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన సౌత్ ఈస్టర్న్ సర్కిల్ సీఆర్‌ఎస్ ఏఎం చౌదరి తన నివేదికను రైల్వే బోర్డుకు గురువారం సమర్పించారు. ఈ నివేదికపై స్పందించేందుకు బోర్డు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 293 మంది ప్రాణాలు కోల్పోగా, 1,000 మందికి పైగా గాయపడ్డారు. షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పూర్తి వేగంతో బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో మెయిన్ లైన్‌కు బదులుగా.. లూప్ లైన్ లోకి వెళ్లి, అక్కడ ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ను ఢీ కొన్నది. ఆ వేగానికి పలు బోగీలు గూడ్స్ ట్రైన్ పైకి దూసుకువెళ్లాయి. పట్టాలు తప్పిన బోగీలు పక్కన ఉన్న మరో ట్రాక్ పై పడిపోయాయి. అదే సమయంలో, ఎదురుగా వేగంగా వస్తున్న యశ్వంత్ పూర్ - హౌరా ఎక్స్ ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.