శవాల మధ్య కొడుకు కోసం వెతుకులాట..గుండెలను పిండేసే దృశ్యం
X
ఒడిశా బాలేశ్వర్ జిల్లాలో సంభవించిన రైలు ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్న ఈ దుర్ఘటనలో వందలాది మంది ప్రజలు రైలు పట్టాలపై నలిగిపోయి విగతజీవులుగా మారారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. సుమారు 900 మంది ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్- హావ్‌డా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించిన తమ వారి కోసం వారి వారి కుటుంబాలు అన్వేషణను మొదలుపెట్టాయి. ఎంత వెతికినా తమవారి జాడ దొరకకపోవడంతో విలవిల్లాడుతున్నారు. అక్కడి పరిస్థితి భయానకంగా ఉండటంతో తమ వారి ఆచూకీ చెప్పేవారు ఎవరూ లేక తీవ్ర ఆందోళనకు గురవుతూ కన్నీరుమున్నీరవుతున్నారు.
రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న అనంతరం సంఘటన స్థాలానికి చాలా మంది ప్రజలు చేరుకుని వారి కుటుంబ సభ్యులను వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో భద్రక్ జిల్లా సుగొ గ్రామానికి చెందిన ఓ పెద్దాయన బాలేశ్వర్కు వచ్చాడు. వృద్ధుడైన ఆ పెద్దాయన తన కుమారుడి ఆచూకీ కోసం అన్వేషిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయ్యా ఎవరైనా నా కుమారుడి ఆచూకీ చెప్పండి అంటూ రోధిస్తున్న ఈ దృశ్యం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. ఫలానా రైలులో నా కొడుకు ప్రయాణిస్తున్నాడు అతని ఆచూకీ చెప్పండి అంటూ కన్నీటిపర్యంతమవుతున్న ఈ వీడియో గుండెలను పిండేస్తోంది.
ఎవరూ తన కొడుకు ఆచూకీ చెప్పే పరిస్థితిలో లేకపోవడంతో ఆ పెద్దాయని ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఉంచి స్థలానికి వెళ్లి అక్కడ కుప్పలుతెప్పలుగా పడి ఉన్న మృతదేహాలపై కప్పివున్న ముసుగును ఒక్కొక్కటిగా తొలగిస్తూ కుమారుడేమైనా ఉన్నాడేమోనని చూస్తున్నారు. అయినా తన కుమారుడి జాడను కనుక్కోలేకపోయాడు. తెల్లవారుజాము నుంచి గాలిస్తున్నప్పటికీ తన కొడుకు జాడ తెలియకపోవడంతో ఎక్కడున్నాడో , ఏమైపోయాడో అంటూ గుండెలవిసేలా రోదించారు ఆ వృద్ధుడు.
https://twitter.com/aka911_/status/1664931877483077634