ఒడిశా రైలు ప్రమాదం: రైల్వే శాఖ కీలక ప్రకటన.. టికెట్ లేని వారికీ..
X
ఒడిశా రైలు ప్రమాద బాధితుల్లో టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం చెల్లిస్తామని రైల్వేశాఖ వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ పరిహారం అందిస్తామని పేర్కొంది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. చనిపోయిన బాధిత కుటుంబీకులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.50వేల చొప్పున పరిహారం సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ‘టికెట్ ఉందా? లేదా? అనేది అంశంతో నిమిత్తం లేకుండా ప్రతిఒక్క బాధితుడికీ పరిహారం అందుతుందని రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు.
ఇప్పటికి 285 కేసుల్లో రూ.6.06 కోట్ల పరిహారం అందజేశామని రైల్వేశాఖ తెలిపింది. మృతుల్లో 31 మంది కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన 83 మందికి, 259 మందిస్వల్ప గాయాలైన వారికి పరిహారం అందజేశామని వివరించింది. ఇంకా 200 మంది బాధితులను గుర్తించాల్సి ఉందని, ఆ వివరాలు వెబ్‌సైట్‌లో వెల్లడించినట్లు తెలిపింది. మరోవైపు, ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్క బాధితుడికి.. వారి కుటుంబీకులను గుర్తించేందుకుగాను తోడుగా ఒక సహాయకుడు ఉన్నాడని రైల్వే బోర్డు (ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) సభ్యుడు జయ వర్మ సిన్హా వివరించారు. హెల్ప్‌లైన్ నంబర్ కూడా అందుబాటులో ఉందన్నారు. చనిపోయిన, గాయపడిన వారి కోసం వచ్చే ప్రయాణికులకు ప్రయాణ, ఇతర ఖర్చులను కూడా తామే భరిస్తామన్నారు.