Home > జాతీయం > మీ మానవత్వానికి హ్యాట్సాఫ్.. క్యూలైన్లలో వెయిట్ చేసి మరీ రక్తదానం

మీ మానవత్వానికి హ్యాట్సాఫ్.. క్యూలైన్లలో వెయిట్ చేసి మరీ రక్తదానం

మీ మానవత్వానికి హ్యాట్సాఫ్.. క్యూలైన్లలో వెయిట్ చేసి మరీ రక్తదానం
X

ఒడిశా ఘోర రైలు ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ప్రమాదంలో 280మంది ప్రాణాలు కోల్పోగా, 1000మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులు మానవత్వాన్ని చాటుతున్నారు. కొంతమంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. మరికొంతమంది క్షతగాత్రుల కోసం రక్తం ఇచ్చేందుకు ఆస్పత్రులకు కదిలారు.

రైలు ప్రమాదంలో గాయపడిన వారిలో చాలామందికి రక్తం అవసరం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులు పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకువచ్చారు. ఆస్పత్రుల వద్ద బారులు తీరి రక్తదానం చేస్తున్నారు. రాత్రి 500 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా ట్వీట్ చేశారు. మరో 900 యూనిట్ల రక్తం నిల్వ ఉందని తెలిపారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసినవారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రక్తదానంపై పలువురు ప్రముఖులు సైతం స్పందించారు. తన అభిమానులు రక్తదానం చేసి గాయపడిన వారి ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ‘రైలుప్రమాద ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రక్తం అవసరం ఉంటుందని అర్థం చేసుకుంటున్నా. రక్తదానం చేసి వారి ప్రాణాలను రక్షించేందుకు సమీప ప్రాంతాల్లోని మా అభిమానులు,సేవా దృక్పథులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు వేగంగా స్పందించారు. వెంటనే సహాయకచర్యల్లో నిమగ్నమై బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. తాము దాదాపు 300 మందిని కాపాడామని కొంతమంది స్థానికులు తెలిపారు. కాగా ప్రమాదస్థలంలో ముమ్మరంగా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు, హెల్త్ సిబ్బంది ఈ చర్యలు పాల్గొంటున్నారు.

Updated : 3 Jun 2023 3:44 PM IST
Tags:    
Next Story
Share it
Top