మణిపూర్లో అమానుషం.. మహిళల్ని నగ్నంగా ఊరేగించి..
X
జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మే 4న రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మే 4న ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఘటనపై మణిపూర్ సీఎం బీరేంద్ర సింగ్ విచారణకు ఆదేశించారు. అటు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సైతం స్పందించారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన ఆమె.. నేరానికి పాల్పడినవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అటు ఈ వీడియో వైరల్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహించింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా ఈ వీడియోలను తక్షణమే తొలగించాలని ట్విటర్‌తో సహా ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున సామాజిక మాధ్యమాలు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలి’’ అని కేంద్రం స్పష్టం చేసింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.