Onion Price Hike: భారీగా పెరిగిన ఉల్లి రేటు.. కిలో ఎంతంటే..?
X
నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు టమాటా రేట్లు భారీగా పెరగగా ఇప్పుడు ఉల్లిగడ్డ వంతు వచ్చింది. మొన్నటి వరకు కిలో రూ.20-25 పలికిన కిలో ఉల్లిగడ్డ రేటు రోజుల వ్యవధిలోనే భారీగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో ఏకంగా కిలో ఉల్లి రూ.80 పలుకుతోంది. ఘాజీపూర్ వెజిటేబుల్ మార్కెట్లో శుక్రవారం 5 కిలోల ఉల్లిగడ్డ ధర రూ.300 ఉండగా.. ఈ రోజు ఆ రేటు రూ.350కి చేరింది. ఈ లెక్కన చూస్తే ఉల్లి ఘాటు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పంట ఆలస్యం కావడంతో పాటు, మార్కెట్కు సరఫరా తగ్గడమే రేటు పెరిగేందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. దసరాకు ముందు రూ.40 నుంచి 50గా ఉన్న కిలో ఉల్లిగడ్డ ధర ఇప్పుడు రూ.70 చేరిందని అంటున్నారు. తమకే రూ.70కి పడుతుండటంతో కస్టమర్లను రూ.80కి అమ్మక తప్పదని చెప్పారు. సప్లై ఇంకా తగ్గితే కిలో రూ.100కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఉల్లితో పాటు టమాట ధరలు కూడా పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు రూ. 20 నుంచి 25 పలికిన టమాటా ప్రస్తుతం రూ.45 నుంచి 50గా ఉంది. కిలో ధర రూ.70 వరకు చేరే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.